శివుడుకు మరియు విష్ణువుకు భేదం ఏమిటి ? ఇద్దరూ వేరు వేరునా ?

1
705


శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః!!

శివకేశవులకు భేదం లేదు…ఇద్దరు ఒక్కరే

శివ కేశవుల అభేదాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నట్లే హరిహరుడు, రామలింగడు, రామేశ్వరుడు, శంకర నారాయణుడు అనే పేర్లు కూడా ఈ అభేదాన్ని చాటుతున్నాయి. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏసమాసానికి చెందినది అనే సందేహం కలిగిందట. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం చెబుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివుని కంటే ఏవిధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అనుకొని వైకుంఠం వెళ్ళారుట. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది రామస్య ఈశ్వరః అని అన్నారట.
ఆ విష్ణువు ఏదో వినయంతోనో, అహంభావం ఉండరాదు అనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలకు మాత్రం సందేహ నివృత్తి కాక కైలాసానికి బయలుదేరారు. దానికి శివుడు సమాధానంగా ఇందులో సందేహానికి ఏముంది? రాముడై ఈశ్వరుడుగా గలవాడు అన్నాడట. అప్పటికీ అర్థంకాక దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు ఇలా అన్నారు. “రామేశ్వరుడంటే రాముడొకడూ ఈశ్వరుడింకొకడూ కాదు రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు” అన్నారట.

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్!!

శివకేశవులొకటే అని బ్రహ్మ బోధించాడట. పురాణాలలో ఒకచోట విష్ణువు జయించాడని, ఒకచోట శివుడు జయించాడని వింటూ ఉంటాం. అంతేకాక కొన్ని చోట్ల ఒకరినొకరు పూజించుకున్నారని వింటాం. పూర్వం బ్రహ్మగారు పంచముఖుడుగా ఉండేవాడు. ఆయనకు కొంచెం అహంభావం హెచ్చినందువల్ల ఈశ్వరునికి కోపం వచ్చి బ్రహ్మగారి ఒకతలను గిల్లి వేశాడట. ఆబ్రహ్మ కపాలం ఒకానొక శాపం ఈశ్వరుని చేతికే అంటుకుపోయిందిట. పైగా బ్రహ్మహత్యాపాతకం ఒకటి చుట్టుకొన్నదిట. అది పోగొట్టుకోవడానికి తిరుకుండియూరులోని పెరుమాళ్ళుని శివుడు పూజించాడని, అందలి మూర్తికి హరశపవిమోచకుడని పేరనీ స్థలపురాణం చెప్తుంది. పరతత్త్వం ఒకటే. తన మాయాశక్తి చేత ఆయా సమయాలలో ఒక్కో రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చే మూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒక్కటే అనే అభేద జ్ఞానం ఎన్నటికీ మరువరాదు. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వ గుణ ప్రధానమైన విష్ణువును ఆరాధించాలి. శివుని రంగు తెలుపు. ఆయన ఉండేచోటు కైలాసం. అదీ తెలుపే. ఈ గుణాలు సత్త్వగుణాన్ని తెలియజేస్తాయి.ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యములు ఏమాత్రమూ లేవు. హరిహరులిద్దరూ ఒక్కటే అది తెలియని వాని నోట్లో మన్ను అని తమిళంలో ఒక సామెత ఉంది. ఒకే తత్త్వం మాయచేత అనేక రూపాలతో గోచరిస్తుంది. పసిబిడ్డకు బొమ్మ మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. అలాగే ఎన్నో వికారాలకు లోనయిన ఈ ప్రపంచాన్ని సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. రజ్జుసర్ప భ్రాంతి. అలాగే వేదాంత శాస్త్ర పఠనం, శ్రవణం వల్ల ఇదంతా మిధ్య అనే ఎరుక కలుగుతుంది. అందువల్ల ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమముగా కొలిచే దేవతలను పరదేవతగా పూజించాలి. తక్కిన దేవతలను పరదేవతయొక్క వేరు వేరు అంశలుగా తెలుసుకొని అభేద అనుభవంతో అచంచలమయిన శాంతితో ఉండాలి. దానిని ఈశ్వరుని అనుగ్రహంతో అనుభవంలోకి తెచ్చుకోవాలి.

1 COMMENT

  1. Dakshayagnam taruvata shivudu parvati dehanni tesuku velletappudu vishnuvu sudarshana Chakram to khandinchadam ane ghattam ee puranam lo vundo dayachesi cheppandi

LEAVE A REPLY