kotipalli

0
320

12241347_897479200372581_3394187225519202373_n

కోటిపల్లి
కోటిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.

కోటిపల్లి గుడిలో శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు, రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణం లో చెప్పబడిఉంది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్టించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు.

ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉన్నది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యంలో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.

ఈ ఆలయ ప్రాంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం మరియు భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు మరియు కొలను కలవు. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఈ పవిత్ర గౌతమీ తీర్థంలోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.

అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు. ఇక్కడ సోమం అనే ఒక పెద్ద పుష్కరిణి ఉండేది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు.

ఆలయం లో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మడపంలో కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయంలోనే చంద్రమౌళిశ్వర స్వామి , శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యంజయ లింగం , నవగ్రహాల గుడి ఉన్నాయి.

ఈ క్షేత్రంలో ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఘనంగా తీర్థం జరుగుతుంది. దీనినే కోటిపల్లి తీర్థం అంటారు.

ఇది కాకినాడ కు 38 కి.మీ.లు, రాజమండ్రి కి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది, ఇక్కడకు పడవ లేదా ఫెర్రి ద్వారా చేరుకోవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY