తిరుమల ఆలయం వాస్తు వైభవం

0
679

images

ప్రాచీన ఆలయాల నిర్మాణాలను పరిశీలించినప్పుడు వైభవో పేతమైన వాస్తులో కూర్చున్న తిరుమల ఆలయం ఎంతో విశిష్టమైంది, పేరెన్ని కగన్నది. శేషాచలం మీద వెలసిన శ్రీవారి ఆలయం మహోన్నత ప్రకృతి వాస్తు సమన్వితమై అలరారుతూ ఉంది. లక్షలాది మంది భక్తుల రాకతో ప్రపంచంలోనే విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందింది.

శ్రీవారి ఆలయంలో దేవుడిని దర్శించే క్షణాలు చాలా తక్కువ, అయినా ప్రతి యేటా భగవంతుడిని చూడాలన్న తపన, కోరిక ప్రతి వారిలో కలుగుతూ ఉంటుంది. వెంకన్న సన్నిధిలో నిరంతరం గడపాలన్న కోరికతో ఉండేవాళ్ళు కోకొల్లలు. దర్శనం స్వల్ప సమయం అయినా దర్శించాలనే కోరిక అనల్పం. అందుకు కారణం వాస్తు ఒడిలో ఒదిగిన ఆ ఆలయ విశిష్టత, ఆ పరిసర ప్రాంతాలు. ఆనంద పరవశం కలిగించే అద్వితీయమైన ఆ ప్రకృతి సౌందర్యాలు ఎటువంటి హృదయంలోనైనా విశాలమైన భావాలను, అంతరంతాల్లో నిలిచి ఉన్న చైతన్యపు శక్తిని తట్టిలేపుతాయి.

* తిరుమల వాస్తు విశేషాలు

వేంకటేశ్వరుని ఆలయ పరిసరాలన్నీ ప్రకృతిసిద్ధమైన వాస్తు అమరికలో ఇమిడి ఉంటాయి. ఆలయ ప్రాంగణంపై నుంచి చూసినప్పుడు పడమర, దక్షిణం, నైరుతిలలో ఎత్తైన కొండలు కనిపిస్తూ ఉంటాయి. పాదాల స్థలం నుండి చూసుకుంటూ వస్తే దక్షిణ, పడమరలు కూడా ఎత్తుగా మనకు కనిపించడం సహజం. ఈశాన్యంలో ఉన్న కోనేరు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ ఆలయానికి పల్లమై ఉంటాయి. ఆలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపవినాశనం, శ్రీతుంబుర తీర్థాలు ఉత్తరాన్ని వాలు చేస్తూ ఉంటాయి.

* వరాహ స్వామి ఆలయం…వెనుక

ఆలయ నిర్మాణ గాథలలో వరాహ నర్సింహ స్వామి శ్రీవారికి తిరుమల స్థలాన్ని బహుకరించినట్లు చెప్పబడుతున్నది. ఇందుకు ప్రతిగా స్వామి వారు తనను దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ ముందుగా వరహాస్వామినే దర్శించుకునేట్లు చేశాడన్నది ఆ గాథల సారాంశం. స్వామివారిని చేరుకోవాలన్న భక్తుల ఆతృతలో నర్సింహస్వామిని దర్శించే వరుస ఎప్పుడో మాయమైంది. వరాహ నర్సింహుని ఆలయం కోనేరుకు ఈశాన్యంలో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆయన ఆలయానికి వాస్తు అమరిలేదు. అందుకే ఆ నియమాన్ని ఉల్లంఘించి భక్తులు శ్రీనివాసుని దర్శించుకునేందుకు ఉరుకులు పరుగుల మీద ఉంటారు.

* వైభవానికి అడ్డుకావు…

ఇక ఆలయ ప్రాకారం చూసినట్లయితే అత్యంత ఎత్తయిన, బలిష్టమైన మూడు ప్రాకారాలు, నాలుగు మాడ వీధులు, తూర్పున విశాలమైన స్థలం ఉండడం ఆలయ ప్రాచీన వాస్తు శాస్త్ర నిబద్ధతని తెలియజేస్తుంది. అయితే ఇటీవల జరిగిన మార్పుల కారణంగా స్వామి వారి ఆలయానికి పడమర వైపు ఏర్పాటు చేసిన కొన్ని ఆరామ ప్రదేశాల వల్ల పశ్చిమ నైరుతిలో వీధిపోటు రావడం కొంత ఇబ్బందిని కల్గిస్తూ ఉంటుంది. అయితేనేమి ఇవేవి ఆయన వైభవానికి అడ్డుకాలేవు.

NO COMMENTS

LEAVE A REPLY